కథ ఎంతసేపు ఉండాలి.? అసలు ఓ కథ ఏం చెప్పాలి.! ఎవరి గురించి చెప్పాలి..? ఎందుకు చెప్పాలి..!? అన్నిటినీ మించి అసలు అవార్డు రావాలంటే ఏం చెయ్యాలి.? ఇలాంటివేవీ “ది ఎలిఫెంట్ విస్పరర్స్’’ ఫిలిం మేకర్స్ అనుకోలేదు. జస్ట్ వాళ్ళ మనసుకి అనిపించింది, మనుసు చెప్పింది తెరకెక్కించారు.
ఇందులో హీరో ఏనుగా..? ఏనుగుని పెంచే మావటి దంపతులా..!? లేదా జంతువునీ మనిషినీ తన ఒడిలో ఓలలాడించిన ప్రకృతా ?! ఏమో ..!? చూస్తున్న 40 నిమిషాలు ఎలాగడుస్తాయో తెలీదు.
అసలు కథేంటంటే…ఇందులో కథుందా.. ఏనుగులకి కథుంటుందా ?! అనే ప్రశ్నలకి ఒకే ఒక సమాధానం. ప్రతీ జీవి భావోద్వేగాలు కలిగి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తే కచ్చితంగా మన హృదయం స్పందిస్తుంది.
తమిళనాడు ముదుమలై అడవిలో నివసించే కుటుంబంలో ఒక మనవరాలు తన అమ్మమ్మని కథ చెప్పమని అడుగుతుంది. అప్పుడు అమ్మమ్మ కథను ఇలా ప్రారంభిస్తుంది. ముగ్గురు గుడ్డివాళ్ళు అడవికి వెళ్లారు అక్కడ వారికి ఒక ఏనుగు ఎదురుపడింది.
ఆ ముగ్గురిలో ఒకడు తొండం తడుముతూ ఇది పాములా ఉందే అన్నాడు. రెండోవాడు ఏనుగు తోక పట్టుకొని ఇది చీపురు కట్టలు ఉంది అన్నాడు. మూడోవాడు ఏనుగు చెవి పట్టుకొని పెద్ద జల్లెడలా ఉందే అన్నాడు.
గుడ్డివాళ్ళు ఈ విధంగానే నిజానికి ఆ ఏనుగు గురించి వాళ్ళకి తోచిన విధంగా ఊహించుకొన్నట్లే కళ్ళున్నవాళ్ళు ఏనుగులు ప్రమాదకరమని,పంటల్ని నాశనం చేస్తాయని అనుకుంటారు.
కానీ ఏనుగులకి అతి దగ్గరగా జీవించే వారికి మాత్రమే వాటి అసలు స్వభావం గురించి పూర్తిగా తెలుస్తుంది. వాటిని ఎంత ప్రేమగా చూసుకుంటే అవి కూడా మన మీద అంతే ప్రేమని చూపిస్తాయి.
అలాంటి రఘు,అమ్ము అనే రెండు ఏనుగులు కథే ఈ 40 నిమిషాల డాక్యుమెంటరీ. ది ఎలిఫెంట్ విస్పర్స్. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ డాక్యుమెంటరీ చిత్రం. తెలుగులో కూడా ఉంది.
ఆసియా ఖండంలో అత్యంత విశాలమైన ముధుమలై అనే అటవీ ప్రాంతంలో ఏనుగుల సమూహ ప్రదేశం లో మావటిలైన బొమ్మన్ – బెర్లి దంపతులు, రఘు-అమ్ము అనే చిన్న ఏనుగులను ఎలా తమ స్వంత బిడ్డల్లా సాకేరో తెలియజేసే భావోద్వేగపు చిత్రం.అడవుల పర్యావరణ పరిరక్షణలో ఏనుగుల పాత్ర అద్వితీయమైనది. అలాగే అక్కడే నివసిస్తూ అడవులను కాపాడే కుటుంబాల పాత్ర తక్కువైనదేమీ కాదు.
ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం మనుషులకి జంతువులు మధ్య ఉన్న భావోద్వేగాలతో ఆకట్టుకుంటుంది. పచ్చని ప్రకృతిలో మనిషి-జంతువుల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమని, చిత్రంలో రఘు అనే ఏనుగు పరిచయంలోనే చూడొచ్చు.
ఏనుగుకి స్నానం చేయించడం, పచ్చికలో ఆడుకునే ఏనుగుకి ఆహారం తినిపిడం, ఏనుగుల సమక్షంలోనే బొమ్మన్-బెల్లీల పెళ్ళి జరగడం వంటి సన్నివేశాలు హృదయాన్ని ద్రవింపజేస్తాయి.
ఎంతో సహజంగా చిత్రీకరించిన ప్రతి సన్నివేశం మనసును ఆకట్టుకుంటుంది. మీరు ఈ చిత్రం చూస్తున్నంత సేపూ మరో సుందరమైన లోకంలో విహరిస్తారు. ఈ చిత్రనికి దర్శకత్వం వహించిన కార్తీకి గొన్ సాల్వేస్ కి ప్రకృతి,ఫోటోగ్రఫీ, జంతువులపై ఉన్న ఇష్టాన్ని ప్రత్యేకంగా చూపిస్తాయి.
సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం కూడా చాలా వీనులవిందుగా ఉంది. మన భారతదేశం నుండి బెస్ట్ డాక్యుమెంటరీ చిత్రం కేటగిరీలో ఈ డాక్యుమెంటరీకి బెస్ట్ డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డుకి రావడం చాలా గొప్ప విషయం. పర్యావరణ ప్రేమికులూ, జంతువుల ప్రేమికులూ, మంచి సినిమాలను ప్రేమించే ప్రేమికులూ, ప్రకృతి ప్రేమికులూ తప్పక చూడాల్సిన డాక్యుమెంటరీ.