ఢిల్లీ ప్రభుత్వాన్ని గద్దె దించింతేనె ధరలు తగ్గుతాయన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడటం బీజేపీ నేతలకు మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. వడ్లు కొనమంటే నూకలు తినమనడం తెలంగాణ ప్రజలను అవమానించడం కాదా అని ప్రశ్నించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నూకలు తినమని అవమాన పరిచిన ఢిల్లీ ప్రభుత్వానికి.. నూకలు చెల్లెలా రాబోయే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఇన్ని రోజులుగా నిమ్మలంగ ఉన్న కేంద్రం.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన వెంటనే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ పై ధరలను పెంచుతూ వస్తోందని ఆరోపించారు. చేతనైతే పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30 వేల పోస్టులను భర్తీ చేసిందన్నారు. మళ్లీ 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనుందని పేర్కొన్నారు. రక్షణ శాఖతో సహా దేశంలోని కేంద్ర ప్రభుత్వ శాఖలలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని హరీష్ అన్నారు. ఖళీగా ఉన్న పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు.