కుమారుడి హత్య కేసులో నేరస్థులను శిక్షించాలని కోరుతూ ఓ కుటుంబం ప్రగతి భవన్ కు చేరింది. సీఎం కేసీఆర్ తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే.. సీఎం ను కలవనివ్వకుండా పోలీసులు తమను అడ్డుకున్నారు.
అంతేకాకుండా బాధిత కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించారు. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన రాము, లక్ష్మి దంపతుల కుమారుడు శివరామ్.. గతేడాది చనిపోయాడు. కొంతమంది తమ బిడ్డను హత్య చేశారంటూ అదే సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతుని తల్లిదండ్రులు.
8 నెలలుగా తిరుగుతున్నా పోలీసులు తమను పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆరోపించారు. తమ కుమారున్ని హత్య చేసిన నిందితులను శిక్షించాలని ఎన్ని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని.. తాము కొట్టాడటానికి ప్రగతిభవన్ కు రాలేదని.. న్యాయం కోసమే సీఎం కేసీఆర్ ను వేడుకోవడానికి వచ్చామంటూ వాపోయారు.
దయచేసి పోలీసులు తమ గోడును వినిపించుకోవాలని కంటనీరుపెట్టుకున్నారు. గోడు వెళ్లబోసుకునేందుకు వస్తే.. పోలీసులు తమను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారని దంపతులు వాపోయారు. కేసీఆర్ స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కంటనీరు పెట్టుకున్నారు.