తాను కష్టపడి కొనుగోలు చేసిన భూమిని తమదంటూ కొందరు వ్యక్తులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని సెల్ టవర్ ఎక్కాడు ఓ రైతు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లికుదురు మండలంలోని చిన్న నాగారం గ్రామంలో పంజాల రమేష్ అనే రైతు నివసిస్తున్నాడు. తమ కుటుంబం 40 సంవత్సరాల క్రితం కొన్న భూమిని.. తమదంటూ కొద్దిరోజుల క్రితం కొందరు వ్యక్తులు అతడికి చెప్పారు.
దీనిపై రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు రమేష్. అయితే.. అధికారులు కబ్జాదారులకే వత్తాసు పలుకుతున్నారని.. తనకు న్యాయం జరగటం లేదని ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంటానని సెల్ టవర్ ఎక్కాడు.
రైతు టవర్ ఎక్కడంతో కాసేపు ఆ పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.