ఆస్తుల కోసం అన్నదమ్ములు కొట్టుకోవడం, భూమి పంచాయితీలో అన్నదమ్ముల మధ్య తేడా వస్తే ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం చూశాం. కానీ.. ఆస్తి పంచివ్వలేదని అన్నదమ్ములు ఇద్దరూ కలిసి కన్నతండ్రిని అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం తుమ్మలపెన్‌పహాడ్ గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన ఎరగాని శ్రీనివాస్ గౌడ్ (50) కు సంతు, రాజశేఖర్ అనే ఇద్దరు కుమారులతో పాటు.. ఒక కుమార్తె ఉంది. కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశాడు శ్రీనివాస్. కాగా.. అతనికి గ్రామంలో కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమి పంపకాల విషయంలో ఇద్దరు అన్నదమ్ముళ్లకు తమ తండ్రితో తరుచూ గొడవ జరుగుతుండేది.
అందులో భాగంగానే తన పేరుమీదున్న భూమిని పంచమని ఒత్తిడి చేశారు కొడుకులిద్దరు. తండ్రి మాత్రం భూమిని పంచి ఇవ్వడానికి ఇష్టపడకపోవడలేదు. ఆగ్రహించిన కొడుకులు ఇద్దరు.. గురువారం ఉదయం కత్తి, గొడ్డలితో తండ్రిపై దాడి చేశారు. అత్యంత కిరాతకంగా నరికి చంపారు.
కేవలం భూమిని పంచివ్వలేదన్న కోపంతో తండ్రి పట్ల ఇద్దరు కొడుకులు కర్కశంగా ప్రవర్తించడం స్థానికంగా కలకలం రేపింది. శ్రీనివాస్‌గౌడ్‌ని కొడుకులే హతమార్చడంతో భార్య, కుమార్తె బోరున విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.