కాపురానికి వెళ్లడానికి నిరాకరించిందనే కోపంతో కూతురుతో పాటు.. భార్యను రోకలిబండతో మోది చంపాడు ఓ తండ్రి. అనంతరం.. తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మహబూబ్నగర్ జిల్లా జైనల్లీపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన కృష్ణయ్య తన కూతురు సరస్వతిని గత నెల 8న క్రిస్టియన్ పల్లికి చెందిన వ్యక్తితో వివాహం జరిపించాడు. వివాహం అయిన పది రోజులకు తల్లిగారింటికి వచ్చిన సరస్వతి కాపురానికి వెళ్లనని నిరాకరించింది. కూతురు కాపురానికి వెళ్లేలా నచ్చ చెప్పమని పలు మార్లు తన భార్యకు చెప్పి చూశాడు.
అయినప్పటికి కూతురు వినకపోవడంతో తండ్రి మందలించాడు. తనకు ఇష్టం లేనప్పుడు బలవంతం పెట్టడం ఎందుకు అన్నట్టు కూతురుకు తల్లి మద్దతు పలకింది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కోపోద్రికుడైన కృష్ణయ్య.. భార్య, కూతురిపై రోకలిబండతో దాడికి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
అనంతరం తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. అక్కడి వాతావరణాన్ని పరిశీలించారు. పురుగుల మందు తాగిన కృష్ణయ్యను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని మహబూబ్ నగర్ డీఎస్పీ మహేశ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ వివరించారు.