వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన ఆరోపణలు చేశారు. 48 వేల కోట్ల రూపాయల నిధులను వైసీపీ నేతలు పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. ప్రజలకోసం ఖర్చు చేయాల్సిన నిధులను సొంత ప్రయోజనాలకోసం వాడుకున్నారని విమర్శించారు.
నిధుల దుర్వినయోగంపై సీబీఐ విచారణ జరపాలని యనమల డిమాండ్ చేశారు. 1.78 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే.. 48 వేల కోట్ల రూపాయలకు ప్రభుత్వం ఎందుకు లెక్కలు చూపలేకపోతోందని యనమల ప్రశ్నించారు. నిధుల దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఆర్టికల్ 360ని అమలు పర్చాలని అన్నారు.
కోర్టులను, చట్ట సభలను కూడా చేతుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ సుమారు రూ. లక్ష కోట్లు తెచ్చారని వివరించారు. దానికి సంబంధించిన లెక్కలు చెప్పలేదని విమర్శించారు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లెక్కలు కూడా బడ్జెట్ లెక్కల్లో చూపాలని 15వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. 2024 నాటికి రూ. 8-9 లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు విపరీతంగా పెరుగుతోందని మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వంలో పీఏసీ వ్యవస్థ ఎందుకు సరిగా పని చేయడం లేదని యనమల ప్రశ్నించారు. పీఏసీ జరగనివ్వకుండా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చట్టాలు చేసే అధికారం లేదని కోర్టులు చెప్పకున్నా.. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మూడు రాజధానులపైన చట్టం చేసే అధికారం లేదని మాత్రమే హైకోర్టు చెప్పిందని స్పష్టం చేశారు. స్పెషల్ బిల్లుల పేరుతో.. నిధులు మళ్లించేందుకే సీఎఫ్ఎంఎస్ విధానం లోపభూయిష్టమనే ప్రచారం చేస్తున్నారని రామకృష్ణుడు ఆరోపించారు.