నేటి చిన్నారులే రేపటి మనభవిష్యత్ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అందు వల్ల వారికి చిన్ననాటి నుంచి నైతిక విలువలు నేర్పించాలని ఆయన సూచించారు.
యువత తమ సామాజిక బాధ్యతను గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో నిర్వహించిన గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మన జన్మనిచ్చిన తల్లిదండ్రులను, సంస్కృతి, సంప్రదాయాలను, పురాణాలను, పండితులను తప్పకుండా ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు.
మాతృభాష, మాతృభూమిని మరవ వద్దనన్నారు. జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు సరైన నిర్ణయం తీసుకునేందుకు మన విద్య, నైతిక విలువలు చాలా ఉపయోగపడతాయన్నారు.