హైదరాబాద్ జీడిమెట్ల సుభాష్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన సంచలనం రేపుతోంది. అయితే.. సోమవారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
బచ్చన్ సింగ్ అనే వ్యక్తి తన భార్యపిల్లలతో కలిసి సుభాష్ నగర్ లో నివసిస్తున్నాడు. వెల్డింగ్ పని చేస్తూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు సుభాష్. అయితే.. సోమవారం తన కూతురు కనిపించకుండా పోయింది. దీంతో.. బాలిక ఆచూకి కనిపెట్టాలని కోరుతూ జీడిమెట్ల పీఎస్ లో ఫిర్యాదు చేసాడు.
దర్యాప్తులో భాగంగా మంగళవారం తెల్లవారుజామున పోలీసులకు ఆ బాలిక మృతదేహమై కనిపించింది. కొత్తగా నిర్మిస్తున్న ఓ బిల్డింగ్ వద్ద తలకు గాయలతో బాలిక మృతిచెందినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు.. బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అయితే.. బాలిక తండ్రి బచ్చన్ సింగ్ తన కూతురిని ఎవరో హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యా..? హత్యా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.