హనుమాన్ జయంతి సందర్భంగా భాగ్యనగరంలో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలీపురా చమాన్ నుంచి తాడ్‌బన్ వరకు కొనసాగనున్న హనుమాన్ శోభాయాత్రలో భక్తులు భారీగా పాల్గొన్నారు. ఈ యాత్రలో నడిచే హనుమాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
21 కిలోమీటర్ల సాగనున్న హనుమాన్ శోభాయాత్రలో మహిళలు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మహిళ మోర్చ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. 200 బైక్‌లతో కాషాయ జెండాలతో మహిళలు ర్యాలీ చేశారు. ఈ శోభాయాత్రలో కాశ్మీర్ ఫైల్ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ పాల్గొనడం గమనార్హం.
ఉడిపి మహారాష్ట్రకు చెందిన దృద్రేశ్వర్ మహరాజ్ హాజరై గౌలిగూడా రామ్ మందిర్ లో హనుమాన్ చాలీసా పట్టించారు. ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం ప్రత్యేకంగా పూలతో అలంకరించిన రధంపై ఏర్పాటు చేసి శంఖం పూరించి హనుమాన్ శోభాయాత్రను లాంఛనంగా ప్రారంభించారు.
భక్తులతో కోలాహలంగా భాగ్యనగరంలో సందడి నెలకొంది. భక్తులకు అలాటి అసౌకర్యం కలగకుండా దేవాలయం కమిటీ సభ్యులు పూర్తి ఏర్పాట్లు చేశారు. యాత్రలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 8వేల మంది పోలీసులతో పాటు.. డ్రోన్ కెమెరాలతో శోభాయాత్ర పర్యవేక్షిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు.