ప్రపంచ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ తీవ్ర రూపం దాల్చుతోంది. దీంతో అప్రమత్తం అయిన పలు దేశాలు.. కరోనా ఆంక్షలను కఠినతరం చేశాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కరోనా ఆంక్షలు సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండేలా దేశ ప్రజలకు పలు సూచనలు చేసింది. ఇకపై కరోనా మాస్క్ ధరించాల్సిన అవసరంలేదని సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. మాస్క్ లేకున్నా బయట తిరిగేందుకు కోవిడ్ వాక్సిన్ సర్టిఫికెట్ కూడా అవసరం లేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు.
కరోనా బూస్టర్ డోసు.. ఒమిక్రాన్ సహా అన్ని వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేయడంతో పాటు.. ప్రాణాపాయస్థితిని, ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరాన్ని తప్పించిందని పేర్కొన్నారు. ఇప్పుడు కరోనాతో పెద్ద ప్రమాదం ఏం ఉండదని వ్యాఖ్యానించారు. ఈక్రమంలో కరోనా ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రధాని తెలిపారు.
ఇదిలాఉంటే.. బ్రిటన్ లో నిత్యం లక్షకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి. అయినప్పటికీ.. ప్రభుత్వం కరోనా ఆంక్షలు ఎత్తివేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోవిడ్-19ను ఇకపై సీజనల్ ఫ్లూగా పరిగణిస్తూ.. ముందస్తుగా టీకా తీసుకోవాలని దేశ ప్రజలకు ప్రభుతం సూచించింది. ఇకపై ఇంటి నుంచే పని చేసుకోవాలని ఉద్యోగులకు సూచించారు.
విద్యాసంస్థలు, బస్సులు, రైళ్లలో ఫేస్ మాస్కులను ధరించాల్సిన అవసరం లేదని జనవరి మూడో వారంలోనే ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో అందరికి బూస్టర్ డోసులు పంపిణీ చేయాలని డిసెంబర్ నుంచే ప్రణాళిక సిద్ధం చేయగా.. ఆ మేరకు వాక్సిన్ పంపిణీ వేగంగా సాగుతుంది. ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా బూస్టర్ డోసు వేసుకోవాలని ప్రధాని తెలిపారు.