నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ వ్యవహారంలో జీహెచ్ఎంసీ ఉపక్రమించింది. సరైన పత్రాలు లేకుండా కేవలం తెల్ల కాగితాలు అప్ లోడ్ చేసి భారీ ఎత్తున జనన, మరణ సర్టిఫికేట్లు అప్ లోడ్ కావడం, నాన్ అవెలబులిటీ సర్టిఫికేట్ తీసుకుని ఆర్టీవో ఉత్తర్వు విధానంలోనే ఎక్కువ అక్రమాలు జరినట్లు గుర్తించారు. ఏకంగా 21 వేల సర్టిఫికేట్లకు సంబంధించిన జారీలో అవకతవకలు జరిగాయని జీహెచ్ఎంసీ అధికారులు తేల్చారు.
ఇప్పటికే పలువురు బీజేపీ కార్పొరేటర్లు అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆందోళన బాట పట్టారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
నకిలీ జనన, మరణ ధ్రువీకరణ సర్టిఫికేట్లను జారీ చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించవద్దని మేయర్ విజయలక్ష్మి, నగర పాలక సంస్థ కమిషనర్ లోకేష్ కుమార్ కు సూచించారు. విచారణలో 21 వేల బోగస్ సర్టిఫికేట్లకు సంబంధించి జారీలో అవకతవకలు జరిగాయని బల్ధియా అధికారులు తేల్చారు. అయితే ఆర్టీవో ప్రొసీడింగ్ లేకుండా ఈ సర్టిఫికెట్లు మంజూరు అయినట్టు అధికారులు చెబుతున్నారు.
ప్రధానంగా అక్రమాలు జరిగిన 15 మీ సేవా కేంద్రాలపై విచారణ జరిపి, నిర్వాహకులు, సంబంధిత దరఖాస్తు చేసిన కంప్యూటర్ ఆపరేటర్ల పై కేసులు పెట్టాలని, అవసరమైతే వాటి లైసెన్స్‌లు రద్దు చేయాలని మేయర్ చెప్పినట్లు తెలిసింది.
మరోవైపు స్టాటిస్టికల్ విభాగంలో పని చేసే నలుగురు నకిలీ సర్టిఫికేట్ల జారీలో తమ వంతు పాత్ర పోషించినట్టు అధికారులు గుర్తించారు. వారిపై కూడా వేటు వేయడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అందరిపై క్రిమినల్ కేసులు పెడతామని మేయర్ స్పష్టం చేశారు. మరలా ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని మహానగర పాలక సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు.