ప్రభుత్వ భూములను రక్షిస్తున్నాడని కక్ష కట్టి కొంత మంది వ్యక్తులు ఓ యువకుడి పై దాడి చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు అతనిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కరీంనగర్ శివారు ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని..వాటిని కాపాడే దిశగా పనిచేస్తున్న సామాజిక కార్యకర్త మనోహర్ పై కొందరు వ్యక్తులు దాడి చేశారు.
ఇక రక్తపు మడుగులో ఉన్న మనోహర్ ను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం కొత్తపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రేకుర్తిలోని సమ్మక్క సారలమ్మ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని.. వాటిని కాపాడాలని మనోహర్ వివిధ రూపాల్లో పోరాడుతున్నారు.
ఇది సహించలేని 18 డివిజన్ కార్పొరేటర్ మాధవి భర్త కృష్ణ గౌడ్.. తనపై కక్ష పెంచుకొని దాడి చేయించాడని బాధితుడు ఆరోపించారు. ఆరుగురు వ్యక్తులు తనపై కర్రలతో దాడి చేసినట్టు మరోహర్ తెలిపారు. అటుగా ట్రాక్టర్ పై వెళుతున్న కొందరు మనోహర్ ను కాపాడి ఆసుపత్రికి తరలించారు. కొత్తపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో.. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
అయితే నిందితులను గుర్తించినట్లు సమాచారం. ఇక 2014నుంచి మనోహర్ ప్రభుత్వ భూములను రక్షించడమే ధ్యేయంగా వందల వినతి పత్రాలను అధికారులకు అందజేశారు. సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న సాక్ష్యాల ఆధారంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇది నచ్చని కొందరు రాజకీయ నాయకులు మనోహర పై కక్ష పెంచుకొని దాడికి పాల్పడినట్లు సమాచారం.