మహిళలకు తెలంగాణలో రక్షణ లేకుండా పోయిందన్నారు పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్. బాధితుల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వం నిందితుల వైపు నిలబడుతుందన్నారు.
వికారాబాద్ లో ఓ ఎస్సై ఆత్మహత్య నుంచి మొదలుకొని.. ప్రీతి ఆత్మహత్య వరకు ప్రభుత్వం పెడధోరణి కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రీతి ఫిర్యాదు.. చేస్తే హెచ్ ఓ డీ కూడా తిట్టాడని,ఆసుపత్రిలో ఏం జరిగింది అనేది తెలియదన్నారు. మెరుగైన వైద్యం ఇవ్వండని మహిళా కమిషన్ ఆదేశాలిచ్చిన తరువాత.. చనిపోయిందని ప్రకటించారని ఆయన ధ్వజమెత్తారు.
నిమ్స్ లో డెడ్ బాడీకి చికిత్స చేశారని, ప్రీతి వాట్సాప్.. చాట్ ఎలా డిలీట్ అయ్యిందని ఆయన నిలదీశారు. ఎవరు చేశారు అనేది తేలాలని ఆయన అన్నారు. కాజ్ ఆఫ్ డెత్ చెప్పండి అని తండ్రి అడిగితే కూడా ఇవ్వట్లేదని, వేధింపులు ఉన్నాయని చెప్తుంటే… ఆత్మహత్య అంటున్నారని ఆయన మండిపడ్డారు. చంపిన వాళ్లను రక్షించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.