మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈసందర్బంగా మంత్రి కేటీఆర్ జిల్లాలోని మహేశ్వరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మీర్ పేట్, బడంగ్ పేట్ లో రోడ్ల విస్తరణ పనులు, నాన్ వెజ్, వెజిటబుల్ మార్కెట్ కు శంకుస్థాపన చేశారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. రూ.400కోట్ల పనులకు శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. త్వరలోనే ఎయిర్ పోర్టుకు ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. శివారు మున్సిపాలిటీల్లోనూ బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారిందని కొనియాడారు. ఎక్కడా లేనివిధంగా సెంటు భూమి ఉన్న రైతుకు కూడా బీమా అందిస్తున్నామని తెలిపారు. రైతు బీమా కింద రూ.5 లక్షలు చెక్కు అందిస్తున్నామని వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా పేదప్రజల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతోందని మంత్రి చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ సమీపంలో ఉన్నప్పటికీ.. అభివృద్ధికి దూరంగా ఉన్న శివారు మున్సిపాలిటీలపై సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాతాశిశు మరణాలు తగ్గాయన్న మంత్రి తెలిపారు. సర్కారీ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. పాఠశాలల్లో సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని అన్నారు. ప్రభుత్వ హాస్టల్లలో ఉంటున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.