కరోనా మహమ్మారి వచ్చాక ఎదురైన ఎన్నో సమస్యల్లో ప్రయాణం కూడా ఒకటి. ముఖ్యంగా విదేశీ ప్రయాణం. చాలా దేశాలు భారతదేశ ప్రయాణికులపై బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. ఇండియా నుండి కెనడాకు వెళ్లే విమానాలను బ్యాన్ చేశారు. అయితే తాజాగా కెనడా ప్రభుత్వం ఇండియా ప్రయాణికులపై నిషేధాన్ని ఎత్తి వేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక నెల పాటు భారతదేశం నుండి నేరుగా కెనడాకు విమానాలు ప్రయాణించనున్నాయి. జస్టిన్ లూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వం సెప్టెంబర్ 27 నుంచి నెల రోజుల పాటు నిషేధాన్ని ఎత్తివేస్తున్నామని, విమానాలు తిరిగి ప్రారంభం కానున్నాయి అని ప్రకటించారు.
అయితే భారతదేశం నుంచి వెళ్లే ప్రయాణికులకు మాత్రం కొన్ని నిబంధనలు ఉన్నాయి.భారతీయ ప్రయాణికులు ఢిల్లీ విమానాశ్రయం నుంచి కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ను పొందాలి.ఆ సర్టిఫికెట్ కూడా 18 గంటల ముందుదై ఉండాలి.బోర్డింగ్ కు ముందు ఎయిర్ ఆపరేటర్లు కెనడాకు రావడానికి వెళ్లడానికి అర్హులని నిర్ధారించడానికి ప్రయాణికుల కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ను చెక్ చేస్తారు.
పూర్తిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సమాచారాన్ని అరైవ్ కాన్ అనే వెబ్సైట్ లో లేదా మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.భారతదేశం నుండి నేరుగా కాకుండా మూడో మార్గం ద్వారా కెనడాకు వెళ్లే ప్రయాణీకులు కూడా తప్పనిసరిగా ఆ దేశం నుండి బయలుదేరే ముందు కరోనా నెగెటివ్ పరీక్షకు సంబంధించిన సర్టిఫికెట్ ను తీసుకోవాలి.
ఎయిర్ కెనడా సెప్టెంబర్ 27 న భారతదేశం నుండి విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. ఎయిర్ ఇండియా సెప్టెంబర్ 30 నుండి కెనడాకు విమానాలను తిరిగి ప్రారంభిస్తుంది.