హైదరాబాద్ లోని ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇతర ప్రాంతాలకు చెందిన ఆటోలను గ్రేటర్ హైదరాబాద్ లో తిరగనివ్వట్లేదని, తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ తనను కలిశారని తెలిపారు. ఇతరప్రాంత ఆటోలపై జరిమానాలు వేస్తున్నారంటూ విన్నవించుకున్నారని ఆయన తెలిపారు.
ఆటోలకు నగరంలో అనుమతి లేనప్పుడు అధికారులు మీటర్ రీడింగ్ సీజింగ్ తో పాటు.. సీరియల్ నంబర్ ఇచ్చి స్టిక్కర్లు ఎందుకు అతికించారని ప్రశ్నించారు రేవంత్. ఇతర రాష్ట్రాలు, దేశాల వాహనాలు తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు.. నగరానికి ఆనుకోని ఉన్న జిల్లాల నుంచి వచ్చే ఆటోలను అనుమతి ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఆటోడ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న రేవంత్.. పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నల్గొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన కొంతమంది తమ ఆటోలను నగరంలోకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. గ్రామాల్లో పని లేకపోవడంతో కొన్నేళ్లుగా నగరంలోనే ఆటో నడుపుతూ జీవనం గడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు జిల్లాల నుంచి తీసుకొచ్చిన ఆటోలను నగరంలో తిరగకూడదని ఆదేశాలు జారీ చేస్తే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వాపోయారు. తమ పర్మినెంట్ చిరునామా గ్రామాల్లో ఉండటంతో అక్కడి అడ్రస్ మీదనే ఆటోలు కొనుగోలు చేసుకున్నామని చెప్పారు. తమ సొంత జిల్లాకు సంబంధించిన ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని వారు వెల్లడించారు.