అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. వడగళ్ల వర్షాలతో దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో గ్రామాల వారిగా అంచనా వేసి తగు పరిహారం అందజేయాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
వడగళ్ల వానలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేతల బృందం కలిశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలకు దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలకు పరిహారం చెల్లించాలంటూ మంత్రికి వినతి పత్రం అందజేశారు.
తాజాగా కురుస్తున్న అకాల వర్షాలు, ఊదురు గాలులతో కూడిన వడగళ్ల వానల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న పంటల వివరాలు క్షేత్రస్థాయిలో గ్రామాల వారీగా అంచనా వేసి రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. మునుపెన్నడూ లేని రీతిలో పడిన వడగళ్ల వర్షాలకు ప్రధాన ఆహార పంట వరితో పాటు పత్తి, మిరప, మామిడితోటలు, కూరగాయలు, పూల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని కాంగ్రెస్ నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
వరి పంటకు ఎకరాకు 12 వేలు, కూరగాయలు, ఆకుకూరల పంటలకు 35 వేలు, మొక్కజొన్న పంటకు 15 వేలు, మామిడి తోటలకు 50 వేలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. పౌల్ట్రీ, డెయిరీ ఫారాలకు బ్యాంకులు వడ్డీ మాఫీ చేయాలని కోరారు. రాయితీపై దాణా సరఫరా చేసి.. షెడ్ల పునర్నిర్మాణానికి ఆర్థిక చేయూత ఇవ్వాలని కోరారు. పూర్తిగా నష్టపోయిన సిమెంట్ రేకులతో కట్టిన ఇళ్లకు ఇంటికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం లేదా రెండు పడకల గదుల పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.