విద్యాబుద్దులు నేర్పించాల్సిన టీచర్లే దారి తప్పి దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులను కేవలం మార్కుల కోసమే గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. మానసిక వేధింపులకు గురి చేసి, చివరికి విద్యార్థులు క్లాస్ రూమ్ లోనే ఆత్మహత్యలకు పాల్పడేటట్టు చేస్తున్నారు.
ఇక ప్రభుత్వ గురుకుల పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. విద్యార్థులకు భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదు. పురుగులు నిండిన, కలుషిత ఆహారాన్ని తిని ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
ఈక్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని అద్దం పట్టేలా మరో సంఘట వికారాబాద్ జిల్లా,పరిగి మండలంలోని సయ్యద్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. తప్పతాగి మైకంలో ఉన్న టీచర్ రాజేందర్ విచక్షణను కోల్పోయి మల్లీశ్వరి అనే ఐదవ తరగతి విద్యార్థినిని చితకబాదాడు. దీంతో ఆమె ఒళ్ళంతా కమిలిపోయింది. అయితే నిత్యం మద్యం సేవించి ఈ టీచర్ పాఠశాలకు వస్తాడని, విద్యార్థులను చితకబాదుతుంటాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
స్థానికులు కూడా ఇదే మాట అంటున్నారు. ప్రతి రోజు టీచర్ రాజేందర్ తప్పతాగి పాఠశాలకు వచ్చి.. పాఠాలు చెప్పడం పక్కన పెడితే.. విద్యార్థులను చితకబాదుతుంటాడని చెబుతున్నారు. ఈ విషయం పై అధికారుల దృష్టికెళ్లినా పట్టించుకోవడం లేదని, టీచరే ఇలా ఉంటే పిల్లలు మంచి బుద్దులు ఎలా నేర్చుకుంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే టీచర్ ను తొలగించాలంటూ వాళ్లు పాఠశాల ముందే నిరసనకు దిగారు.