తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే.. తెలంగాణలో కోవిడ్ ఆంక్షలు జనవరి 31 నాటికి ముగిశాయి. కానీ.. కోవిడ్ ఆంక్షల గడువు పెంచలేదు ప్రభుత్వం. మళ్ళీ ఆంక్షలు పొడగిస్తున్నట్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ రాజకీయ, మత, సాంస్కృతిక పరమైన కార్యక్రమాలకు అనుమతి లేదంటూ జనవరి ఒకటిన ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
బహిరంగ ప్రదేశాలు, షాపింగ్ మాల్స్, కార్యాలయాల్లో మాస్క్ తప్పని సరి అంటూ అప్పటి ఉత్తర్వుల్లో సర్కార్ పేర్కొంది. ఉత్తర్వులు పొడగించలేదు కాబట్టి.. ఆంక్షలు లేనట్టేనని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. మరోవైపు సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత పాఠశాలలు, కాలేజీలు కూడా తెరిచారు.
దీంతో రోడ్లపై రద్దీ కూడా పెరిగింది. కరోనా నిబంధనలు పాఠశాలలు, కాలేజీల కేనా? సామాన్యులకు, వ్యాపారులకు ఆంక్షలు వర్తించవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో సోమవారం 81,486 కరోనా టెస్టులు చేయగా 2,861 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
జీహెచ్ఎంసీ పరిధిలో 746 కొత్త కేసులు నమోదు కాగా.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 234, రంగారెడ్డి జిల్లాలో 165, ఖమ్మం జిల్లాలో 130, నల్గొండ జిల్లాలో 104 కేసులు వెల్లడయ్యాయి. కేసులు ఈవిధంగా నమోదవుతుంటే నిబంధనలు ఎత్తివేయడం సమంజసం కాదంటున్నారు నిపుణులు. ఆంక్షలు విధిస్తేనే ఈ మహమ్మారి అదుపులోకి వస్తోందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.