అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు తెలంగాణ విద్యార్థుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మృతదేహాలను భారత్ కు తీసుకొచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని గవర్నర్ అధికారులను ఆదేశిస్తూ ట్వీట్ చేశారు.
భారత విదేశీ వ్యవహారాల శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురికి మెరుగైన వైద్య సహాయం అందించేందుకు విదేశీ వ్యవహారల శాఖ సహాయపడాలని కోరారు.
కాగా.. అమెరికాలో ఈ నెల 21న జరిగిన రోడ్డు ప్రమాదం తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో హైదరాబాద్, ఖమ్మంకు చెందిన విద్యార్థులు ఉన్నారు.
ఉన్నత చదువుల కోసం యూఎస్‌కు వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తమ బిడ్డల చివరి చూపుకోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.