అకాల వర్షాలకు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైంది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి జనగామ జిల్లా కేంద్రంతో పాటు.. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అరబోసిన ధాన్యం తడిసిముద్దయింది.
ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు టార్పాలిన్ పరదలు కప్పిన లాభం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నట్టుండి వచ్చిన ఈదురు గాలులకు పరదలు కొట్టుకపోయి ధాన్యం తడిసిముద్దయిందని కంటనీరుపెట్టుకుంటున్నారు.
కనీస వసతులు లేకుండా నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తోందంటున్నారు రైతులు.
రైతులకు గన్ని బ్యాగుల కొరత ఏర్పడటంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అధిక నిల్వలు ఉన్నాయని..బ్యాగులు లేకపోవడంతో సకాలంలో కొనుగోలు జరగడం లేదని అంటున్నారు. దీంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.