దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు తగ్గుతున్నాయి. కానీ కేరళ, మహారాష్ట్రతో సహా కొన్ని రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కోవిడ్-19 థర్డ్ వేవ్ ఆందోళన పెరుగుతోంది. పండుగ సందర్భంగా అన్ని భద్రత చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో 10 ఏళ్లలోపు చిన్నారులు ఈ మహమ్మరి బారిన ఎక్కువగా పడుతున్నారు. ఇండియాలో కోవిడ్ -19 ఎమర్జెన్సీ స్ట్రాటజీని రూపొందించే బాధ్యత చేపట్టిన ఎంపవర్డ్ గ్రూప్ -1 లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఏడాది మార్చిలో మొత్తం యాక్టివ్ COVID-19 కేసులలో పిల్లలు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఆగస్టులో ఇది 2.80 శాతం నుంచి 7.04 శాతానికి పెరిగింది. దీని అర్థం ప్రతి 100 కోవిడ్ కేసులలో 7 మంది చిన్న పిల్లలు ఉన్నారన్న మాట.
పాలసీ కమిషన్ (NITI ఆయోగ్) సభ్యుడు వికే పాల్ అధ్యక్షతన జరిగిన ఈజి-1 సమావేశంలో ఈ డేటా సమర్పించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సహా వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఆగస్టులో మిజోరంలో అత్యధికంగా (మొత్తం యాక్టివ్ కేసులలో 16.48 శాతం), న్యూఢిల్లీలో అత్యల్పంగా (2.25 శాతం) కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. మిజోరాం (16.48 శాతం), మేఘాలయ (9.35 శాతం), మణిపూర్ (8.74 శాతం), కేరళ (8.62 శాతం), అండమాన్, నికోబార్ దీవులు (8.2 శాతం), సిక్కిం (8.02 శాతం), దాద్రా, హవేలి (7.69 శాతం), అరుణాచల్ ప్రదేశ్ (7.38 శాతం) కేసులు ఉన్నట్లు ఆ నివేదికలో వెల్లడైంది.
ఆగస్టులో కోవిడ్ -19 కేసులు తక్కువగా ఉన్న రాష్ట్రాలలో పుదుచ్చేరి (6.95 శాతం), గోవా (6.86 శాతం), నాగాలాండ్ (5.48 శాతం), అసోం (5.04 శాతం), కర్ణాటక (4.59 శాతం), ఆంధ్రప్రదేశ్ (4.53%), ఒడిశా (4.18%), మహారాష్ట్ర (4.08%), త్రిపుర (3.4%), ఢిల్లీ (2.25%) ఉన్నాయి.