తెలంగాణ సర్కార్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎర్రబెల్లి సెక్యూరిటీ విషయంపై హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. దీంతో తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది.
ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు సెక్యూరిటీ తొలగింపుపై దాఖలైన పిటిషన్ ను ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ మేరకు విచారణ జరిపిన ధర్మాసనం గతంలో ఉన్న భద్రతను యథావిధిగా కొనసాగించాలని ఆదేశించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భద్రత తొలగించారని.. హైకోర్టులో ఎర్రబెల్లి ప్రదీప్ రావు పిటిషన్ వేశారు.ఎందుకు తొలగించారో తెలియదని,తనకు సమాచారం ఇవ్వకుండా తొలగించారని పిటిషన్ లో పేర్కొన్నారు ఆయన.
గతంలో కోర్టు ఆదేశాలతో ప్రదీప్ రావుకు భద్రత కల్పించారని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని 2 ప్లస్ 2 భద్రత కల్పించాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 2 ప్లస్ 2 భద్రత కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఇదిలా ఉండగా గణతంత్ర వేడుకలపై కూడా బుధవారం హైకోర్టు కీలక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సిందేనని ఆదేశించింది. కరోనా సాకు చూపించి గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వం నిర్వహించకపోవడం ఏమాత్రం సరైనది కాదని ధర్మాసనం తీర్పునిచ్చింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను చేయాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వానికి బుధవారం వరుస షాక్ లు ఎదురయ్యాయి.