రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి ఘటనను హైకోర్టు సుమోటో పిటిషన్ గా స్వీకరించింది. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన వార్తలను పిల్ గా పరిగణించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ దీనిపై ఈ రోజు విచారణ చేయనుంది.
ఈ పిటిషన్ కు సంబంధించి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్,జీహెచ్ఎంపీ అంబర్ పేట్ డిప్యూటీ కమిషనర్, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీని ప్రతివాదులుగా చేసింది. ఇది ఇలా ఉంటే కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు మరణించిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం నిన్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.
తరువాత గృహకల్ప కాంప్లెక్స్ ప్రాంగణంలో పార్టీ ప్రతినిధుల బృందం ప్లకార్డులు ప్రదర్శించారు. కుక్కలను అదుపు చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీలపై కేసులు నమోదు చేయాలని కమిషన్ ను కోరారు.
అయితే అంబర్ పేట్ ఛే నెంబర్ చౌరస్తాలోని ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న గంగాధర్ నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్ కుక్కల దాడిలో ప్రాణం వదిలాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో పిల్లలను సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లాడు గంగాధర్. ప్రదీప్ ఆడుకుంటుండడంతో తండ్రి పనుల్లో నిమగ్నమయ్యాడు. ఇంతలో ఒక్కసారిగా కుక్కలు చిన్నారిని రౌండప్ చేశాయి.
ఆ వీధి కుక్కలను చూసి భయపడిన బాలుడు తప్పిచుకునేందుకు అటూ.. ఇటూ.. పరిగెత్తాడు. ఎంతకీ వదలని కుక్కలు.. ఒకదాని తరువాత ఒకటి దాడి చేయడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రదీప్ ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.