ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో పోర్చుగల్ లోని అజోరెస్ తీరంలో నౌక కొట్టుకుపోయింది. పోర్షే, బెంట్లీ, సహా వేలాది ఇతర కార్లను అమెరికా రోడ్ ఐలాండ్స్ లోని డేవిస్ విల్లే మోసుకెళ్తున్న భారీ నౌక అగ్నిప్రమాదానికి గురైంది. బుధవారం నుంచి నౌకలోని కార్లు మండుతూనే ఉన్నాయి.
అందులోని 22 మంది సిబ్బందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫెలిసిటీ ఏస్ గా పిలిచే ఈ నౌక జర్మనీలోని ఎమ్డెన్ నుంచి ఫిబ్రవరి 10న బయలుదేరింది. అజోరెస్ లోని టెర్సీరా ఐలాండ్ కు దాదాపు 200 మైళ్ల దూరంలో ఉండగా ఈ కార్గో షిప్ లో మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న వెంటనే బుధవారం పోర్చుగీసు దళాలు నౌకను చేరుకుని అందులోని సిబ్బందిని హెలికాప్టర్ ద్వారా రక్షించి సమీపంలోని పోర్చుగీస్ ఐలాండ్ కు తరలించాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు.
షిప్పింగ్ కంపెనీ కూడా ఈ విషయమై ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. 189 బెంట్లీ కార్లు సహా దాదాపు 4,000 కార్లు ఈ నౌకలో ఉన్నట్టు తెలుస్తోంది. తమవి కూడా 1100 కార్లు ఉన్నట్టు పోర్షే తెలిపింది.