ప్రస్తుతం ఆడ,మగ అన్న తేడా లేకుండా అన్నీ రంగాల్లో మహిళలు కూడా దూసుకెళుతున్నారు. మహిళ సాధికారిత వైపు అడుగులు వేగంగా పడుతున్నాయి. అయినా కాని కొందరి ఆలోచనల్లో మాత్రం ఇంకా మార్పులు రావడం లేదు. ఆడపిల్ల పుట్టడాన్ని కొంత మంది ఇంకా శాపంగా,పాపంగానే భావిస్తున్నారు.
కొందరు ఆడపిల్ల పుట్టిందని చెత్తకుప్పల్లో పడేస్తుంటే.. మరికొందరు ఆడపిల్ల పుట్టినందుకు భార్యను శిక్షిస్తున్నారు. ఇలాంటి తాజా సంఘటనే హైదరాబాద్ అంబర్ పేట్ లో వెలుగులోకి వచ్చింది. భార్య.. ఏడేళ్లుగా అత్తింటి వారితో న్యాయపోరాటాన్ని చేస్తోంది. ఎందుకంటే ఆడపిల్ల పుట్టిందని ఆమె భర్త, అత్త,మామలు ఆమెను పుట్టింటికి పంపించేశారు. దీంతో తనను ఇంట్లోకి రానివ్వాలని బాధితురాలు మాధవి తన కూతురితో కలిసి భర్త ఇంటి ముందు బైఠాయించింది.
అయితే బిడ్డ పుట్టినప్పట్నుంచి మాధవి న్యాయపోరాటం చేస్తూనే ఉంది. ఆడపిల్లకు జన్మనిచ్చాననే కారణంతో భర్త కిరణ్ కుమార్, అత్తమామలు ఇంటి నుంచి గెంటేసినట్లు బాధితురాలు కన్నీరుమున్నీరవుతుంది. ఇక గత మూడు రోజులుగా మాధవి భర్త ఇంటి ముందు నిరసన చేపడుతోంది.
కానీ భర్త, అత్తమామలు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. దీంతో తనను, తన కూతురిని ఇంట్లోకి అనుమతించే వరకు కూతురితో కలిసి ఇక్కడే ధర్నా చేస్తానని మాధవి చెబుతోంది. తనకు, తన కూతురికి న్యాయం చేయాలని ఆమె పోలీసులను కోరుతుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే మాధవికి పలు మహిళా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.