వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటన గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీంతో వారి అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ నేత అరవింద్ బాబు కార్యకర్తలతో ధర్నా చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నా ఆపే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దర్నాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరగింది. ఈ ఘటనలో అరవింద్ కు గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అరవింద్ ఆరోగ్య పరిస్థితి నిలకరగానే ఉందని ఆయన కుటుంబీకులు వెల్లడించారు. దీంతో పార్టీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు.
ఈ నేపథ్యంలో.. నరసరావుపేటలో టీడీపీ నాయకులు మరోసారి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో మాజీ మంత్రులు జవహర్, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, యరపతినేని, తెనాలి శ్రావణ కుమార్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమంగా అరెస్టు చేసిన టీడీపీ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు.
అంతేకాకుండా.. అరవింద్ బాబుపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అక్రమంగా కేసులు పెడుతూ టీడీపీ నాయకులను ప్రార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని నల్ల జెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. విడుదల చేయకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.