తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల మోత మోగుతోంది. టీఎస్‌ఈఆర్సీ చార్జీల పెంపునకు పచ్చజెండా ఊపింది. విద్యుత్ చార్జీలు 19 శాతం పెంచాలని డిస్కంలు ప్రతిపాదించగా 14 శాతం పెంచేందుకు కమిషన్ అంగీకరించింది. గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ చార్జీల యూనిట్‌కి 40 పైసల నుంచి 50 పైసల వరకూ పెంచనున్నారు.
ఇతర వినియోగదారులకు యూనిట్‌కి రూపాయి చొప్పున భారం పడనుంది. అలాగే డొమెస్టిక్ వినియోగదారులపై కొత్తగా ఫిక్స్‌డ్/ కస్టమర్ చార్జీలు విధించనున్నారు. అయితే.. డిస్కంలు అప్పులలో కూరుకుపోవడంతో చార్జీలు పెంచక తప్పడం లేదని గత కొంత కాలంగా చర్చ నడుస్తోంది. విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించి డిస్కంలు గత డిసెంబర్‌లోనే ప్రతిపాదనలను టీఎస్‌ఈఆర్సీకి సమర్పించాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అక్కడక్కడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా సామాన్య ప్రజలపైన భారం పడిందనుకుంటే.. అధిక చార్జీలతో రాష్ట్రం ప్రభుత్వం మరోభారాన్ని ప్రజలపై మోపడానికి సిద్ధం అయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
కాగా.. పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి డిమాండ్ చేశారు. పలువురు పార్టీ నేతలతో కలిసి ఈఆర్సీ చైర్మన్ రంగారావుకు వినతి పత్రం అందజేశారు. విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోకుంటే కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.