ఐపీఎల్-2022 ముగిసిని తర్వాత 15 రోజుల వ్యవధిలోనే భారత్.. దక్షిణాఫ్రికా టూర్ కు రెడీ అయింది. జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో ఆడనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కు బీసీసీఐ టీం ను ప్రకటించింది. అయితే.. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా సిరీస్‌లో విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. దీంతో కేఎల్ రాహుల్ కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది.
జూన్ 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. కొంతమంది సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చినప్పటికీ.. సెలెక్టర్లు ఈ సిరీస్ కోసం సమతూకం పాటించారు. టీమ్ ఇండియా ఎంపికలో, అనుభవం, యువ ఉత్సాహం మధ్య సామరస్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
కాగితంపై కనిపించే ఈ జట్టు మైదానంలో కూడా మెరుగ్గా రాణించాలనే పూర్తి ఆశతో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు సెలక్టర్లు. చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశం దక్కిందని వెల్లడించారు. డాషింగ్ డైనమిక్ బ్యాట్స్ మెన్ దినేష్ కార్తీక్ కు మరో అవకాశం కల్పించారు సెలక్టర్లు. కొత్తగా.. ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ లను జట్టులోకి తీసుకొచ్చారు.
కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ అను సెలక్ట్ చేస్తూ సరికొత్త టీం ను ప్రకటించారు సెలక్టర్లు.