వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఒకప్పుడు ఆరోగ్య ప్రధాతా సుఖీభవ అంటూ దండాలు పెట్టారు. మా పాలిట దేవుడంటూ మొక్కుకున్నారు. వెనక ఏం జరిగినా, నిజంగానే పేదలకు కార్పొరేట్ వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారానే సాధ్యమైంది. అందులో సందేహం లేదు. కాని కొన్నాళ్లకు అసలు దండాలు పెడుతుంది కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలని అర్ధమైంది. చాలా లేటుగా తెలిసినా.. పేదలకు జరిగే న్యాయం కన్నా.. ఆస్పత్రులకు జరిగే న్యాయమే గ్రేటుగా ఉందనే విషయం బయటపడింది. ఆరోగ్యశ్రీ పేరుతో చికిత్స అందించినట్లు బిల్లులు పెట్టుకోవడం.. డబ్బులు దండుకోవడం కామనైపోయింది.
తర్వాతి ప్రభుత్వాలు కాస్త కంట్రోల్ పెట్టడానికి ప్రయత్నించాయి. కాని అది అలాగే నడుస్తోంది. పైగా ఆరోగ్యశ్రీ టారిఫ్ కు తగ్గట్టుగా అన్నట్లు వారికి వేరే నాసిరకమైన సౌకర్యాలు మాత్రమే ఈ కార్పొరేటు ఆస్పత్రులు కల్పిస్తాయి. దండుకునేటప్పుడు మాత్రం కోట్లకు కోట్లు.. డాక్టర్, వైద్య సౌకర్యం వరకు లోటు ఉండదు కాని.. వసతి సౌకర్యాలు మాత్రం ఘోరంగా ఉంటాయి. ఆరోగ్యశ్రీ పేషెంట్లు అంటే..వాళ్లేదో దిక్కులేనోళ్లు అన్నట్లే చూస్తారు.
సరే ఇప్పుడు.. వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఆయన అడుగుజాడల్లోనే ఆరోగ్యశ్రీ పరిధిని పెంచుతామని ప్రకటించారు. అమల్లోకి కూడా వెళుతున్నారు. దాదాపు 1200 రకాల కొత్త వ్యాధులు, చికిత్సలు చేరుస్తున్నారు. అసలు రు.1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేస్తుందని తేల్చారు. అంతే కాదు.. రు.5 లక్షల వార్షికాదాయం ఉన్నవారందరూ అర్హులేనని చెప్పారు. ఇవన్నీ మంచి నిర్ణయాలేనని చెప్పాలి. దీంతో ఆరోగ్యశ్రీ బిల్లింగ్ భారీగా పెరగబోతుందని అర్ధమైపోయింది.
ఇతర రాష్ట్రాలకు కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పగానే.. ఏపీలో అడ్వాన్స్ డ్ చికిత్స అందించే ఆస్పత్రులు లేక హైదరాబాద్ పరుగుపెట్టేవారు ఆనందపడ్డారు. హైదరాబాద్ ఒక్క టే కాదు, కర్నాటక, తమిళనాడులో కూడా చేయించుకోవచ్చన్నారు. కర్నాటక, తమిళనాడు బోర్డర్ లో ఉంటున్న జిల్లాల జనం కూడా సంతోషించారు.
అయితే ఇప్పుడా ఆస్పత్రుల లిస్టు చూసి షాకవుతున్నారు. కర్నాటకలో బెంగళూరులో ఆస్పత్రులంటే ఓకె.. కాని షిమోగా, భద్రావతి, వంటి ప్రాంతాలలో ఉన్న ఆస్పత్రులను కూడా లిస్టులో పెట్టారు. అక్కడ చేయించుకున్నా.. మన కార్డు పని చేస్తుంది.. వారికి బిల్లు చెల్లిస్తారు. ఇంత దూరంలో ఉన్న ఆస్పత్రులను ఎందుకు పెట్టారని ఆలోచిస్తే.. మన సర్కారువారి దూరదృష్టి తెలుస్తోంది.
ఆస్పత్రి లిస్టులో ఉంటే చాలు.. పేషెంటు కార్డు దొరికితే చాలు.. బిల్లు కొట్టేస్తారు. ఇలా డమ్మీ బిల్లులు లెక్కకు మించి పెట్టుకుని.. శాంక్షన్ చేయించుకుంటారు. బిల్లు డబ్బులొచ్చాక.. ఎవరి వాటా వారికిచ్చేస్తారు. అదీ సంగతి. ఇలా దోపిడీ చేసుకోవడానికే ఎక్కడెక్కడి ఆస్పత్రులన్నీ లిస్టులో పెట్టేశారు. మళ్లీ తమిళనాడు, తెలంగాణలోని ఆస్పత్రులు అలా పెట్టలేదు. కర్ణాటక అంటే మనకు బాగా పట్టున్న రాష్ట్రం కదా.. అందుకే అయింటుంది.