రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య పై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉంది. మరో వైపు ఇంటర్ బోర్డు ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టింది. వెంటనే దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
ఇలా ఉంటే..సాత్విక్ సూసైడ్ ను తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ సీరియస్ గా పరిగణించింది. సుమోటోగా కేసు స్వీకరించామని కమిషన్ సెక్రటరీ స్వరూపారాణి తెలిపారు. ఘటనపై నిజనిర్ధారణ చేసి, త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని ఇంటర్మీడియట్ కమిషన్ ను ఆదేశించింది. ఇలా ఉంటే.. కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేక పోతున్నానని సూసైడ్ నోట్ రాసి, క్లాస్ రూమ్ లో సాత్విక్ ఉరేసుకున్నాడు.
ఫిబ్రవరి 28 వ తేదీన రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. షాద్ నగర్ లోని ఫారూఖ్ నగర్ కు చెందిన నాగుల సాత్విక్ టెన్త్ లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు.నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు. హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే తనకు ఫుడ్ సరిగా పడడం లేదని, స్టడీ అవర్స్ లో లెక్చరర్లు, వార్డెన్ వేధిస్తున్నారని, కొడుతున్నారని చాలా సార్లు తల్లిదండ్రులకు చెప్పి బాధపడ్డాడు.
వైస్ ప్రిన్సిపల్ ఆచార్య, లెక్చరర్ కృష్ణా రెడ్డి, వార్డెన్ నరేశ్ వేధిస్తున్నారని చెప్పాడు. సరిగా చదవడం లేదని అవమానిస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని వాపోయాడు. ఇక వీటన్నింటిని తాళలేకే సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.