కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 2 భూసేకరణ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ ప్రక్రియలో తమకు అన్యాయం జరుగుతుందంటూ పెగడపల్లి మండలం నామపూర్ గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు.
నామాపూర్ గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2 భూసేకరణ పైప్ లైన్ కింద 21 మంది భూనిర్వాసితులు ఉన్నారు. వారందరూ మొత్తంగా 48 ఎకరాల వ్యవసాయ భూమి కోల్పోతున్నారు.
ఆ భూసేకరణలో భాగంగా ప్రభుత్వం నష్ట పరిహారం కేటాయించింది. భూమి విలువ కంటే తక్కువ పరిహారాన్ని ఇస్తున్నారని భూనిర్వాసితులు చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్తున్న నష్టపరిహారం సరిపోదని.. వ్యవసాయ బావులు గెజిట్ లో రాకుండా అధికారులు తప్పుల తడకగా సర్వే చేశారని భూ నిర్వాసితులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.
అడ్వకేట్ ప్రసేన్ మిథున్ శశాంక ద్వారా హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు నిర్వాసితులు. దీంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ పి.వినోద్ కుమార్ భూసేకరణ ప్రక్రియను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో భూనిర్వాసితులకు తమకు ఊరట కలిగిందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.