కథలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులను ఆకట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదు. భారీ బడ్జెట్ తో నిర్మించబడి ఇటీవల రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాలు ప్రజలను ఎంతలా ఆకట్టుకున్నాయో అందరికి తెలిసిన విషయమే. అయితే.. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చి బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ సినిమాలో కశ్మీరీ పండితులపై జరిగిన అఘాయిత్యాలను కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.
కేవలం 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన హిందీ సినిమా.. దానికి పది రెట్లు ఎక్కువ వసూలు చేయడమనేది ఎవరి ఊహకు అందని విషయం. పెద్ద స్టార్స్ ఎవరూ లేని చిన్న బాలీవుడ్ మూవీ.. మూడు వందల కోట్లకు దగ్గరగా వెళ్లి చరిత్రను తిరగరాసిందని అంటున్నారు సినీ ప్రముఖులు. హైదరాబాద్ లాంటి నగరాల్లో మూడు వారాలకు పైగా హౌస్ ఫుల్ బోర్డులతో భారీ కలెక్షన్లు రాబట్టడం చిన్న విషయం కాదంటున్నారు.
అయితే.. ఇప్పుడీ సెన్సేషనల్ మూవీ ఓటీటీలో రాబోతోంది. ఇందులో విశేషం ఏముందనుకుంటున్నారా..? మాములుగా ఎంత పెద్ద సినిమాకైనా సరే థియేటర్ కు డిజిటల్ కు మధ్య గ్యాప్ చాలా తగ్గిపోయింది. రాధే శ్యామ్ 20 రోజులకు, భీమ్లా నాయక్ 30 రోజులకు ఓటీటీలో వదిలారు సినీ మేకర్స్. కేజిఎఫ్ 2 కూడా 50 రోజుల మార్కుకు ముందుగానే ప్రైమ్ లో వచ్చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. అలాంటిది ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం మాత్రం 60 రోజుల తర్వాత రావడమంటే ముమ్మాటికీ ఆసక్తి గల విషయమే అంటున్నారు. అయితే.. దీన్ని జీ5లో మే 13న వరల్డ్ ప్రీమియర్ చేయబోతున్నారట.
దీన్ని మిస్ చేసుకున్న రీజనల్ ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం తెలుగు తదితర భాషల్లో డబ్బింగ్ చేసి అందించబోతోంది జీ5. కొత్త సినిమాల పోటీ విషయంలో వెనుకబడినట్టుగా కనిపించిన ఈ డిజిటల్ ప్లాట్ ఫార్మ్.. ది కాశ్మీర్ ఫైల్స్ లో ఉన్న హిందూ ఎమోషనల్ కనెక్షన్ లక్షల్లో కొత్త సబ్ స్క్రైబర్స్ ని తీసుకొస్తుందనే నమ్మకంతో జీ5 ఈ స్ట్రాటజీని ఫాలో అవుతుందనుకుంటున్నారు. వ్యూస్ పరంగా కనివిని ఎరుగని రికార్డులు సృష్టించడం ఖాయమని డిజిటల్ వర్గాల అంచనా వేస్తున్నాయి. చూడాలి మరి స్మార్ట్ స్క్రీన్ పై ఇంకెన్ని సంచలనాలు రేపనుందో ఈ సినిమా.