‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా మార్చి 11న థియేటర్లలో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివేక్ అగ్ని హోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఉహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విమర్శకుల ప్రశంసలతోపాటు రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమాను మళ్లీ చూసేందుకు చూసేందుకు ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా..? అని ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానుల నిరీక్షణకు ఈ వారం తెర పడనుంది.
థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీని షేక్ చేసేందుకు రెడీ అయింది. ఇక ఈ సినిమా రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5 కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో మే 13 నుంచి జీ 5 లో ప్రసారం చేస్తున్నట్లు వెల్లడించారు మేకర్స్. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని మెచ్చుకున్నారు. ప్రధాని మోడీ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. పలువురు బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం ఈ సినిమా చూడాలన్నారు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. 90వ దశకంలో కశ్మీర్ పండితులపై అక్కడి జిహాదిలు చేసిన ఊచకోతకు ప్రతిరూపంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో మిథున్ చక్రబర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.