బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి వేదికగా ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా యాదగిరి గుట్టలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రసంగించిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ గెలిచిన వెంటనే ఎవరు సీఎం అయినా.. తొలి దర్శనం భాగ్యలక్ష్మి అమ్మవారినే చేసుకుంటామని బండి సంజయ్ పేర్కొన్నారు.
ప్రతి కార్యకర్త ఉగ్రనరసింహస్వామి అవతారం ఎత్తి.. టీఆర్ఎస్ రాక్షస పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రతో సీఎం భయపడుతున్నారని ఎద్దేవా చేశారు బండి. నల్గొండలో బీజేపీ ఎక్కడ ఉందని చాలా మంది మాట్లాడారని, ఖమ్మం జిల్లాలోనూ బీజేపీ బలం ఏంటో చూపిస్తామని అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త.. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అవతారం ఎత్తి కేసీఆర్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
యాదాద్రి ఆలయ నిర్మాణం పేరుతో కేసీఆర్ నాణ్యత లేని పనులు చేయించారని…తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. అదేవిధంగా అన్నం కోసం.. త్రిబుల్ఐటీ, గురుకుల పాఠశాల విద్యార్థులు ఏడుస్తున్నారని గుర్తు చేశారు. పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారంటూ.. అదే అన్నం కేసీఆర్ మనుమడు తింటుండా? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, దళితులకు 3 ఎకరాల భూమి, రైతు బంధు ఎంతమందికి వచ్చిందని ప్రశ్నించారు బండి సంజయ్.
వాసాలమర్రిలో 100 హామీలిచ్చి..ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని..నేతన్నలకు అండగా బీజేపీ పోరు బాట చేస్తోందని..చేనేత బీమా కోసం బీజేపీ అవిశ్రాంతంగా పోరాటం చేస్తోందని భయంతో టీఆర్ఎస్ సర్కారు చేనేత బీమా ప్రకటించారని బండి సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ చేతకాని, మూర్ఖపు పాలన వలన 2000 మంది చేనేత కార్మికులు మరణించారని..వారి కుటుంబాలకు బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజమంతా బీజేపీ వైపే చూస్తోందని..ఉద్యోగస్తులు, రైతులు, వివిధ వర్గాల ప్రజలను బీజేపీకి మద్దతు ఇవ్వమని కోరారు. గడీల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని బంధవిముక్తి చేయాలంటే… బీజేపీ అధికారంలోకి రావాలని పిలుపు నిచ్చారు.