ఆసియా కుంభమేళాగా చెప్పుకునే మేడారం జాతర చివరి రోజుకు చేరింది. తమ మొక్కులను తీర్చుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. రెండేళ్ల కొకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజతర కు సుమారు రెండు కోట్లకు భక్తులు తరలివచ్చారని అధికారులు వెల్లడించారు. కోరిన కోర్కెలు తీర్చే తమ ఇలవేల్పులకు భక్తులు మనసారా మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు నెల రోజుల నుంచి భక్తులు తల్లుల దర్శనం కోసం తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు.
ప్రధాన జాతర బుధవారం ప్రారంభం కాగా.. గురువారం సమ్మక్క రాకతో జాతర ముఖ్యమైన ఘట్టం మొదలైంది. శుక్రవారం తల్లులు గద్దెల పైనుంచి భక్తులకు దర్శన మివ్వడంతో మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర చివరి అంకానికి చేరుకుంది. తెలుగు రాష్ట్రాలతో మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, ఓడిశా, కర్నాటకతో పాటు.. దేశ నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి తల్లులకు మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ రాగా గురువారం చిలుకల గట్టు నుంచి సమ్మక్క గద్దెకు చేరడంతో తల్లి బిడ్డల దర్శనం కోసం గద్దెల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి పోయింది. తల్లులిద్దరు కొలువుదీరిన తర్వాత దర్శనం చేసుకునేందుకు భక్తజనంతో మేడారం నిండిపోయింది.
రూపాలు లేని ఆదిపరాశక్తులుగా భక్తుల ఆరాధ్య దైవాలుగా కొలువబడుతున్న సమ్మక్క సారలమ్మలు కోట్లాది మంది భక్తుల మొక్కులను స్వీకరించారు. దట్టమైన కీకారణ్యంలో చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా విడిది చేసినప్పటికీ.. చీమకు కూడా హాని తలపెట్టకుండా మూడు రోజుల పాటు మేడారంలో భక్తులు బస చేస్తున్నారంటే.. అదంతా తల్లుల మహిమ వల్లనే అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంతానం లేని వారికి సంతానం కల్పిస్తూ, అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం కల్పిస్తూ రకరకాల సమస్యలతో వచ్చే భక్తుల కష్టాలను కన్నీళ్ళను తుడుస్తూ వారికి అండగా వనదేవతలు ఉంటారని అక్కడికి వచ్చే భక్తుల నమ్మకం.
ధనిక, పేద తారతమ్యం లేకుండా భక్తులందరు ఒకే విధంగా మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితి. నిరుపేద భక్తులు పెద్దమొత్తంలో కానుకలు సమర్పించుకొవడం సాధ్యం కాదు. కాబట్టే.. బెల్లన్నే బంగారంగా భావించి తమ కానుకగా స్వీకరించి భక్తుల కొరికలను ఆ మహిమాన్విత తల్లులు తీరుస్తారట. గురువారం రాత్రి నుంచి లక్షలాది మంది భక్తులు తల్లుల దర్శనాలు చేసుకుని మొక్కులు సమర్పించుకున్నారు.