పులులు సింహాలను సినిమాల్లో చూసి భయపడుతారు ప్రజలు. అలాంటిది మన ఇంటి ముందుకో.. మన వీధిలోకో వస్తే.. పరిస్థితి ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి ఘటనే.. ముంబైలో చోటు చేసుకుంది. ఓ కాలనీలోకి వచ్చిన చిరుత పులి.. కాలనీ అంతా చక్కర్లు కొట్టింది. దాన్ని చూసిన కాలనీ వాసులు భయంతో వణికిపోయారు.
ముంబై నగరంలోని గోరేగావ్ ఈస్ట్ ప్రాంతంలో ఓ గేటడ్ కాలనీలోకి చిరుత ఎంట్రీ ఇచ్చింది. కాలనీ అంతా తిరుగుతూ… ఓ గేటు ముందు కూర్చొంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఓ చీకటిగా ఉన్నా ప్రాంతంలోకి వెళ్లిపోయింది. చిరుత సంచరించిన వీడియోను సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
ఇప్పడు ఆ విజువల్స్ వైరల్ గా మారాయి. ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. స్థానికంగా నివసించేవారికి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నారు. గోరేగావ్ ప్రాంతంలో వీధి కుక్కల కోసం.. ఇలా తరుచూ అడవి జంతువులు వస్తుంటాయని స్థానికులు చెప్తున్నారు. దీంతో నిత్యం ఇక్కడి ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల్లో చిరుతపులి కదలికలు కనపడుతున్నాయని అటవీ శాఖ అధికారులు అన్నారు.
అయితే.. ఈ ప్రాంతంలో చిరుత పులి కనిపించడం సర్వసాధారణంగా మారింది. కొన్ని సార్లు మాత్రం ప్రమాదకరమైన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. గతేడాది సెప్టెంబర్ లో ఇదే ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలిపై చిరుతపులి దాడి చేసింది. దీంతో ఆ మహిళ వెంటనే తేరుకొని చిరుతపై పోరాడింది. కర్రతో భయపెట్టింది. దీంతో చిరుత అడవిలోకి పారిపోయింది. కొద్ది రోజుల క్రింతం ఇదే ప్రాంతంలో 14 ఏళ్ల బాలుడిని చిరుతపులి గాయపరిచింది. బాలుడు రాత్రిపూట వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా జంతువు అనుకొని అతనిపై దాడి చేసింది. బాలుడి అరుపులు విని అతని స్నేహితులు సాయం చేసేందుకు పరిగెత్తారు. వారిని చూసిన పులి అక్కడి నుండి పారిపోయింది. బాలుడి మెడ, నోరు, తలపై గాయాలయ్యాయి.