హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అర్థరాత్రి ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం పడడంతో చాలా కాలనీలు నీట మునిగాయి. ఈ క్రమంలో ఇళ్ల ముందు నిలిపిన వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
కొంపల్లి నుంచి దూలపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై నీటి ప్రవాహం మోకాళ్ల లోతు వరకూ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.అత్యవసరంగా వెళ్లేవారు ఒకరికొకరు సహాయం తీసుకొని వరద నీటిలో నుంచి రోడ్డు దాటుతున్నారు. రోడ్డుపై భారీగా వరద నీరు చేరడంతో మేడ్చల్, కరీంనగర్ హైవేపై వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. జీడిమెట్ల, సూరారంలోని చెరువులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది.సుచిత్ర నుంచి కొంపల్లి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు కిలో మీటరు వరకూ రోడ్లపై వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైదరాబాద్ నగరం నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న వాహనాలు.. సుచిత్ర వద్ద నిలిచిపోయాయి.
ఇటు సుచిత్రలోని గాయత్రికాలనీలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలనీవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు. పిల్లలు స్కూళ్లకు, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీటితో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెబుతున్నారు.