– కొరకరాని కొయ్యగా మారిన మరియూపోల్ భూగర్భ నగరం
– దాదాపు 24 కిలోమీటర్లు పొడవైన సొరంగాలు
– శత్రు దుర్భేధ్యంగా స్టీల్ ప్లాంట్
– అజోవ్‌స్టల్ ముట్టడికి తొందరపడొద్దన్న రష్యా అధినేత
– అజోవ్‌స్టల్‌పై దాడి అసాధ్యమని అభిప్రాయపడ్డ పుతిన్
– మారియూపోల్ పూర్తిగా తమ వశమైందన్న పుతిన్
– పుతిన్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన జెలెన్‌స్కీ
రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ పై సాగిస్తున్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను ముందుగా స్వాధీన పరుచుకునేందుకు రష్యా బలగాలు మారణకాండను సాగిస్తున్నాయి. ఉక్రెయిన్ లోని వ్యూహాత్మక రేవు నగరం మరియూపోల్ ను దాదాపు రెండు నెలల భీకర పోరు తర్వాత రష్యా సైన్యం హస్తగతం చేసుకుంది. అయితే.. ఈ నగరంలోని అజోవ్‌స్టల్ స్టీల్ ప్లాంట్ మాత్రం ఇంకా ఉక్రెయిన్ సైన్యం అధీనంలోనే ఉంది. నగరం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నప్పటికీ.. అక్కడ మాత్రం మాస్కో సైన్యాల వ్యూహాలు ఫలించడం లేదు. అజోవ్‌స్టల్ ముట్టడి విషయంలో రష్యా అధినేత కూడా తొందరపడొద్దని సూచించినట్టు సమాచారం.
అంతేకాదు.. అందులోనుండి చిన్న పురుగు కూడా బయటకు వెళ్లకుండా చుట్టు ముట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. దాదాపు 11 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాంట్ మాత్రమే మరియూపోల్ లో ఉక్రెయిన్ సేనలకు చివరి స్థావరంగా నిలిచింది. ఉక్రెయిన్ పారిశ్రామిక మణిహారాల్లో అజోవ్‌స్టల్ ఒకటి కాబట్టి.. దానిని ధ్వంసం చేయకుండా తన సైన్యాలను నిలువరించారు. ఈ కర్మాగారంలోని కిలోమీటర్ల కొద్దీ సొరంగాలను కవచంగా చేసుకొని రష్యా దళాలపై కీవ్ సైన్యాలు దాడిచేస్తున్నాయి. దీంతో ఇప్పుడు యావత్తు ప్రపంచం దృష్టి ‘అజోవ్‌స్టల్’పై పడింది.
ఈ స్టీల్ ప్లాంట్ నుంచి ఏటా దాదాపు 40 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది. మరియూపోల్ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాటి ఈ కర్మాగారంపై వేలాది మంది ఉద్యోగులు ఆదారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ కర్మాగారాన్ని 1930ల్లో ఉమ్మడి సోవియట్ హయాంలో నిర్మించగా.. 1933 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. కానీ.. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు 1941-1943 వరకు ఆక్రమించారు. ఆ తర్వాత అజోవ్‌స్టల్ ను తిరిగి సోవియట్ స్వాధీనం చేసుకొని సముద్రం ఒడ్డున నాలుగు మైళ్ల పొడవునా పలు విభాగాలను నిర్మించింది. ఈ కర్మాగారాన్ని చూస్తే మరియూపోల్ కింద మరో నగరం ఉందా..? అన్నట్టు ఉంటుంది.
రైల్వే లైన్లు, గొడౌన్లు, బొగ్గు కొలిమిలు, కర్మాగారాలు, చిమ్నీలు, సొరంగాలతో 11 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ ప్లాంట్ విస్తరించి ఉంది. ఇందులో ఉండే దాదాపు 24 కిలోమీటర్లు పొడవైన సొరంగాలు.. సేనలు వేగంగా పొజిషన్లు మార్చుకొనేలా సహకరిస్తాయి. అర్బన్ వార్ఫేర్ కు అత్యంత అనుకూలమైన వాతావరణం ఇక్కడ ఉంది. దీనికి తోడు సరిహద్దుల్లో రష్యాతో ఉద్రిక్తతలు మొదలైన కొద్ది రోజుల్లో భారీగా నిత్యావసరాలు, మందుగుండ్లు ఉక్రెయిన్ తరలించి నిల్వ చేసింది. దీంతో ఉక్రెయిన్‌కు చెందిన 36వ మెరైన్ గ్రూప్, అజోవ్ బ్రిగేడ్‌లు ఇందులో నుంచే రోజుల తరబడి యుద్ధం చేస్తున్నాయి.
ఒక దశలో విసిగిపోయిన రష్యా దళాలు.. లోపలి వారిని బయటకు రప్పించేందుకు రసాయన దాడులు చేస్తాయని పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా దళాలు మొండిగా ఈ భూభాగంలో వెళితే భారీగా నష్టపోతాయని పుతిన్ గ్రహించారు. అందుకే.. దాడి చేయకుండా కేవలం ముట్టడించి సమయం కోసం ఎదురు చూడాలని ఆదేశించారు. అందులో భాగంగానే అజోవ్‌స్టల్‌పై దాడి అసాధ్యమని పుతిన్ అభిప్రాయపడ్డారు.
అజోవ్‌స్టల్ నుంచి పోరాటం కొనసాగిస్తున్న సైనికుల వివరాల విషయంలో ఉక్రెయిన్ అత్యంత గోప్యంగా వ్యవహరిస్తోంది. అక్కడ ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని బయటపెట్టడం లేదు. దీనికి కారణం పుతిన్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటైన ‘అజోవ్ రెజిమెంట్’ కూడా ఈ ప్లాంట్ లో ఉండటమే కావచ్చు అంటున్నారు నిపుణులు. ఇక.. మారియూపోల్ పూర్తిగా తమ వశమైందని గురువారం పుతిన్ చేసిన ప్రకటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ వ్యంగ్యంగా స్పందించారు. ఇప్పటి వరకు అజోవ్‌స్టల్ ను రష్యా దళాలు స్వాధీనం చేసుకోలేకపోయాయని ఎద్దేవా చేశారు.