ఆప్ ఎన్నికల విజయం వెనుక బయటకు కనిపించని ఓ వ్యక్తి ఉన్నారు. ఆయనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ కు చెందిన I-PAC తో కేజ్రీవాల్ చేతులు కలపడంతోనే ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రశాంత్ కిశోర్ పన్నిన వ్యూహం ఫలించింది. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహమే కారణమని చెబుతుంటారు. ఆ తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు విజయం సాధించడంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పని చేశాయి. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో అర్వింద్ కేజ్రీవాల్ కూడా చేరిపోయారు.
ఆప్ ప్రభుత్వం చేపట్టిన కొన్ని ఉచిత పథకాలతో పాటు సోషల్ మీడియా, క్షేత్ర స్థాయిలో ప్రచారం పార్టీ విజయానికి కీలక పాత్ర పోషించాయి. బీజేపీ పై ప్రజలకున్న అసమ్మతిని, సమస్యలను రకరకాల ప్రచారాలతో వినూత్నంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానం వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారని చెబుతున్నారు. వాటర్, పవర్, మురుగు నీటి పారుదల, రోడ్లు, స్కూళ్లు, హాస్పిటళ్లతో వంటి స్కీమ్ లతో పాటు ఆప్ ఈసారి కొత్త వ్యూహాలను అమలు చేసింది. పార్టీ ప్రచారం పాట ”లగే రహో కేజ్రీవాల్” ను బాలీవుడ్ కంపోజర్, కేజ్రీవాల్ మద్దతు దారునిగా చెప్పుకునే విశాల్ దడ్లానీ కంపోజ్ చేశారు. గ్యారంటీ కార్డు, టౌన్ హాల్ సమావేశాలు, సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవడంతో I-PAC టీమ్ ఆప్ ను విజయానికి దగ్గరగా చేర్చిందంటున్నారు. ఆప్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా ప్రకటించక ముందే ఇండియా ఆత్మను కాపాడినందుకు ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. సీఏఏ ను బహిరంగంగానే వ్యతిరేకిస్తున ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలో ఎన్నికల్లో ప్రజలు ప్రేమతో ఓటేయాలని కోరారు. దేశంతో సామరస్యాన్ని, సోదర భావాన్ని కాపాడాలని అన్నారు. మొత్తమ్మీద తన పొలిటికల్ స్ట్రాటజీస్ తో ప్రశాంత్ కిషోర్ ఆప్ కు విజయం సాధించి పెట్టినట్టు తెలుస్తోంది.