సమాజం ఎంత అభివృద్ధి చెందినా.. ఆడవాళ్లపై అఘాయిత్యాలు ఆగడంలేదు. వరకట్న వేదింపులు తగ్గడం లేదు. గర్భిణి అనే కనికరం లేకుండా అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యపై యాసిడ్ పోసి హత్య చేశాడు ఓ దుర్మార్గపు భర్త. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాలోని మాల్కాపూర్‌కు చెందిన కళ్యాణికి, వర్ని మండలం రాజ్‌పేట్ తండాకు చెందిన తరుణ్‌తో నాలుగేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఏడాది పాటు సజావుగా సాగిన వారి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. తనకు సరైన జోడీ కాదని.. రెండో పెళ్లి చేసుకుంటానని.. తనకు విడాకులు ఇవ్వాలని తరుణ్ భార్యను తరచూ వేధిస్తుండే వాడు.
ఇలా కొంతకాలానికి ఆమె గర్భం దాల్చింది. తను బతికుంటే తాను ఇంకో పెళ్లి చేసుకోవడాని వీలు కాదనుకున్న తరుణ్.. కుటుంబ సభ్యులతో కలిసి కళ్యాణిని హతమార్చాలనుకున్నాడు. తరుణ్ తో పాటు.. తన తండ్రి పిర్య, అతని అన్న ప్రవీణ్ లు బలవంతంగా కళ్యాణి నోట్లో ఎలుకల మందు కలిపిన యాసిడ్ పోశారు.
బాధితురాలు గట్టిగా కేకలు పెట్టడంతో పక్కింట్లో ఉంటున్న ఆమె అక్క శోభ అక్కడికి వచ్చింది. చుట్టు పక్కల వారి సహయంతో కళ్యాణిని నిజామాబాద్ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ.. కళ్యాణి మృతి చెందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతురాలి బంధువులు తరుణ్ ఇంటిపై దాడిచేసి ఫర్నిచర్, వస్తువులు ధ్వంసం చేశారు.