చట్టం అవసరమైనప్పుడే పని చేస్తుంది. అవును మరి..వైఫై ఉన్నోడు.. మనోడైతే.. పాస్ వర్డ్ దేముంది పెద్ద లెక్కా.. అలాగే బ్యాంక్ మేనేజర్ మనోడు అయితే.. ప్రాపర్టీ ఎవరిదైతే ఏంటి.. ఎంతైతే ఏంటీ.. లోన్ రావడం పక్కా.. కాని అవతల మనోడు కాకపోయినా పర్వాలేదు.. శత్రువైతే మాత్రం.. చాలా డేంజర్.. ఆ విషయం జేసీ ప్రభాకర్ రెడ్డికి బాగా తెలిసొచ్చింది. మనోళ్లు ఉన్నప్పుడు.. ఎన్ని రంకెలేసినా.. ఏమీ కాలేదు.. కాని ఇప్పుడు నోరు తెరిస్తే కేసు.. అరిస్తే కేసు.. అడిగితే ఇంకో కేసు. అలా అయిపోయింది పరిస్ధితి. జైలు నుంచి విడుదలైన సంతోషం.. పూర్తిగా అనుభవించనే లేదు.. ఈలోపే.. పోలీసులు వేసిన ట్రాప్ లో పడి.. రెచ్చిపోయి.. మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
పోలీసులు డ్యూటీ చేయాలనుకుంటే ఎలా చేస్తారో ఈ ఒక్క ఉదాహరణ చాలు. చేయకూడదనుకుంటే.. ఎలా చేస్తారో కూడా చాలా ఉదాహరణలు వస్తున్నాయి. వైసీపీ యూనిఫాం వేసుకోని.. వైసీపీ కార్యకర్తలు పోలీసులు అన్న మాటలు అక్షర సత్యాలు అని గట్టిగా.. చాలా గట్టిగా చెప్పుకోవచ్చు.
కోవిడ్ నిబంధనలు పాటించని వైసీపీ ఎమ్మెల్యేల సంగతి.. జాతీయ మీడియాకు సైతం ఎక్కింది. అయినా వారిపై కేసులు పెట్టలేదు.. పెట్టలేరు.. పెట్టరు కూడా. కాని టీడీపీ నేతలు పొరపాటున ఉల్లంఘించారో.. వేటు పడటానికి పోలీసుల చేతిలో వేటకత్తి వేలాడుతూ ఉంటుంది. ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే రోజా, ఇంకా ఇప్పుడు కరోనా సోకి.. చికిత్స పొందుతున్న ఎమ్మెల్యేలంతా దాదాపు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినవారే.. పోలీసులు పట్టించుకోకపోయినా కరోనా పట్టించుకుంది. అక్కడలా వ్యవహరించిన పోలీసులు.. ఇక్కడ జేసీ విషయంలో మాత్రం పక్కా ప్లాన్ ప్రకారమే వ్యవహారం నడిపించారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు ఆర్టీయే కేసులో బెయిల్ వచ్చింది. తమ నాయకుడు జైలు నుంచి వస్తున్నారని.. పైగా మనం తగ్గలేదని చూపించుకోవాలని.. అత్యుత్సాహంతో ఆ వర్గం నేతలు, కార్యకర్తలు అంతా భారీ సంఖ్యలో కడప జైలుకు చేరుకున్నారు. అప్పటికి ఇంకా పోలీసులకు ఎలాంటి ఆలోచనా లేదు. ఎప్పుడైతే మీడియాలో జైలు దగ్గర జేసీ అనుచరుల హడావుడి చూశారో.. వెంటనే వైసీపీ ముఖ్య నేత నుంచి పోలీసులకు ఫోన్ వెళ్లింది. అంతా చకచకా ప్లాన్ రెడీ అయిపోయింది
ఆ వాహనాలు ర్యాలీగా బయల్దేరి అనంతపురం చేరేసరికి ఎదురుగా సీఐ వచ్చి ఆపాడు. ఇక్కడ సీఐ సెలెక్షన్ కూడా ముందస్తు ప్లానే. ఆయన దళితుడు.. అదే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఈ ప్లానులో. ఆపగానే.. జోష్ లో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. తన ఒరిజినల్ స్టయిల్ లో సీఐ మీద విరుచుకుపడ్డారు. ఆపితే ఇలాగే జరుగుతుందని.. ప్రభాకర్ రెడ్డి ఇలాగే మాట్లాడతారని పోలీసులకు ముందే తెలుసు.. చక్కగా అంతా రికార్డ్ చేసుకుని.. వెళ్లిపోయి.. కేసు పెట్టేశారు. బెయిల్ పేపర్స్ సబ్ మిట్ చేయడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డిని, అస్మిత్ రెడ్డిని ఇద్దరినీ మళ్లీ కోర్టుకు తీసుకుపోయి.. 14 రోజుల రిమాండ్ వేయిపించేశారు.
జైలు నుంచి బయటికొచ్చి.. ర్యాలీ నిర్వహించినందుకు.. మళ్లీ జైలుకు వెళ్లిపోయారన్నమాట. ఇక్కడ ఏ కేసును తప్పుబట్టానికి వీలు లేదు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించింది వాస్తవమే..
జేసీ ప్రభాకర్ రెడ్డి సీఐ మీద అరిచింది వాస్తవమే.. ఆ కేసులు కూడా లీగలే. సమస్య ఏంటంటే.. ఇలా ఇంకెవరి మీదైనా పెట్టారా.. ఇలా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారా.. సీఐదేముంది.. ఏకంగా ఎస్పీ మీదే అరిచిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కేసు పెట్టారా.. ఇలా ప్రశ్నించుకుంటూ పోతే చాలా ఉంటాయి. మొత్తం మీద చట్టం చుట్టానికి ఒక రకంగా.. ప్రత్యర్ధులకు ఒక రకంగా పని చేస్తుందనేది మాత్రం వాస్తవం.. దీన్ని ఎవరూ కాదనలేరు కూడా.