తెలంగాణ బార్డర్ ను దాటి మహారాష్ట్రలో చేపట్టిన బహిరంగ సభను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 5న మహారాష్ట్రలోని నాందేడ్ లో జరుగుతున్న ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్ రెడ్డి, టీఎస్ఐఐసీ ఛైర్మన్ బాలమల్లు తదితరులతో కలిసి శుక్రవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సభాస్థలికి చేరుకొని నిర్వాహకులతో మాట్లాడారు. సభ వేదిక, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. నాందేడ్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలు, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు సభకు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని..అందరూ సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేయాలని సూచనలిచ్చారు.
ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేతలను కలుస్తూ గులాబీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ లోకి చేరుతున్నారు. బోకర్ మండలం రాఠీ సర్పంచ్ మల్లేష్ పటేల్ తో సహా 100 మంది మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ నాయకులు బామిని రాజన్న ఆధ్వర్యంలో కండువాలు కప్పి మంత్రి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత పొరుగు రాష్ట్రంలో నిర్వహించనున్న తొలి సభను విజయవంతం చేసేందుకు సంబంధించిన ఏర్పాట్లను పటిష్టంగా చేస్తున్నామన్నారు.