రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. అయితే సాయంత్రం నగరంలోని ఉత్తర ప్రాంతాల్లో ముఖ్యంగా కేపీహెచ్ బీ, నిజాంపేట్, ప్రశాంతి నగర్, గాజులరామారం ప్రాంతాల్లో వడగళ్ల వాన కురియడంతో హైదరాబాదీలు ఆశ్యర్యానికి గురయ్యారు. జేఎన్టీయూ, మణికొండ వంటి ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసి ఆఫీసులకు వెళ్లేవారిని పరుగులు పెట్టించింది. చాలా మంది ఆ ఆహ్లాదకరమైన దృశ్యాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
అయితే.. ఈ వడగళ్ల వానతో జగిత్యాల, కరీంనగర్ తదితర ప్రాంతాల్లోని రైతులు తీవ్ర పంట నష్టాన్ని చవిచూశారు.ఆదివారం కూడా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
అయితే ఈ నేపథ్యంలోనే.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్దవంగర మండలాలలోని వివిధ గ్రామాలలో అకాల వడగండ్ల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబాబాద్,జనగామ జిల్లాలలో వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతుల పంటను సర్వే చేయాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.
అకాల వర్షానికి కూలిపోయిన ఇండ్లను సర్వే చేసి నష్టపోయిన వారికి 3 లక్షల స్కీములో చేర్చుతామని మంత్రి అన్నారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన మామిడి తోటలు, మొక్కజొన్న, వరి సర్వే చేసి నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన పంటలను అంచనా వేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు ఎర్రబెల్లి.