జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రారంభించిన కేసీఆర్ త్వరలో ఢిల్లీ వేదికగా పావులు కదపాలన్న ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో బీఆర్ఎస్ తాత్కాలిక భవన్ ను ప్రారంభించగా పార్టీ పర్మినెంట్ ఆఫీస్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
బుధవారం బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వసంత్ విహార్ లో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయ నిర్మాణ ప్రాంగణాన్ని మంత్రి కలియతిరిగి క్షేత్ర స్థాయిలో పనులను పర్యవేక్షించారు.
పనుల పురోగతిపై ఆర్కిటెక్ట్, వర్క్ ఏజెన్సీతో సమీక్ష నిర్వహించారు. అధినేత కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు మంత్రి ఆదేశించారు.