రాజకీయ నేతలకు ఈ మధ్య ఫ్లెక్సీలతో పెద్ద తలనొప్పే వచ్చిపడుతుంది. ప్రజలు తమ నిరసనను అక్షరాలుగా మార్చి.. ఫ్లెక్సీల రూపంలో ప్రశ్నించడం మొదలు పెట్టడమే దీనికి కారణం. ఆ మధ్య కాలంలో బండి సంజయ్ కు పాదయాత్రలో ఆయన్ను ప్రశ్నిస్తున్న ఫ్లెక్సీలు హల్ చల్ చేశాయి. తరువాత కేటీఆర్ కు కూడా అదే పరిస్థితి తలెత్తింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి మంత్రి కేటీఆర్ కు ఆయన సొంత నియోజక వర్గం సిరిసిల్లలో ఇలాంటి ఫ్లెక్సీలతోనే నిరసన సెగ ఎదురైంది.
ఐదేళ్ళయినా ఇచ్చిన హామీ నెరవేర్చలేదంటూ ప్రజలు నిరసనకు దిగారు. ఎల్లారెడ్డి పేట మండలం వెంకటాపూర్ గ్రామంలో గత 5 ఏళ్ల క్రితం ప్రధాన మురికి కాలువ నిర్మిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఇంత వరకు కాలువ నిర్మించలేదు. దీంతో నిరసనకు దిగిన స్థానికులు ఈ మురికి కాలువకి మోక్షం ఎప్పుడు అంటూ ఫ్లెక్సీలు కట్టి నిరసన తెలిపారు.
‘2017 లో వెంకటాపూర్ గ్రామంలో మురికి కాలువ నిర్మాణానికి హామీ ఇచ్చి మరిచిన కేటీఆర్.. దీన్ని పట్టించుకోని అధికారులు. ఈ మురికి కాలువకి మోక్షం ఎప్పుడ కేటీఆర్’ అంటూ ఫ్లెక్సీ వేయించారు. అయితే ఈ ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నాయకులు,పోలీసులు తొలగించారు.
అయితే ఫ్లెక్సీలు తొలగించినా.. తమను అరెస్ట్ చేసినా తమ నిరసన ఆగబోదని స్థానికులు తేల్చి చెబుతున్నారు. కేటీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు.. రేపటి నుంచి నిరాహార దీక్షకు దిగుతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.