ఉత్తరాఖండ్ లోని చంపావత్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి వాహనం అదుపుతప్పి లోయలో పడిన ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన సుఖిదాంగ్-దాందమినార్ రహదారిపై చోటుచేసుకుంది.
మంగళవారం తెల్లవారుజామున వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండంగా ఈ దుర్ఘటన జరిగినట్లు కుమావోన్ డీఐజీ నీలేష్ ఆనంద్ భర్నే తెలిపారు. పంచముఖి ధర్మశాలకు చెందిన లక్ష్మన్ సింగ్ కుమారుడు మనోజ్ సింగ్ వివాహ వేడుకలకు బందువులు, స్నేహితులంతా మహీంద్ర మ్యాక్స్ వాహనంలో వెళ్లారు.
సోమవారం అర్ధరాత్రి తర్వాత తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో వాహనం అదుపు తప్పి.. ఒక్కసారిగా రహదారి పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చంపావత్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.