పెళ్ళి వేడుకలో అత్తారింటికి అల్లుడు వస్తున్నాడంటే.. బ్యాండ్, బాజాలు, డీజేలు,బాణాసంచా..అబ్బో…! చెప్పేదేముంది ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు దుమ్ములేపుతారు. తమ పెళ్ళివేడుకు పది మందీ పదికాలాల పాటు చెప్పుకునేలా నిర్వహిస్తుంటారు.
కానీ..ఛత్తీస్ గఢ్ లో అమ్మాయి తరుపువాళ్ళు గేదెల్లా వేషం కట్టి బురదలో పొర్లాడుతూ వరుడికి స్వాగతం పలికారు. ఇదేంటి ఇదేం గోల అనుకుంటున్నారా…! కంగారు పడకండి ఇది ఆ తెగవారి సాంప్రదాయమట. ఏంటి ఇలాంటి సాంప్రదాయాలు కూడా ఉన్నాయా అనుకుంటున్నారా. అదేగా మరి..! మనదేశం స్పెషలు.
భారత దేశం భిన్న సంస్కృతుల పట్టగొమ్మ. వివిధ మతాలు, కులాలు, తెగలవారు నివసిస్తుంటారు. ఒక్కో జాతికి ఒక్కో సంప్రదాయం ఉంటుంది. ఆయా రాష్ట్రాల ప్రజలు.. వారి సంప్రదాయాలను పాటిస్తారు.
వివాహాది, ఇతర కార్యక్రమాల్లో భిన్న సంప్రదాయాలను పాటిస్తుంటారు.ఛత్తీస్ గఢ్ లోని వింత సాంప్రదాయం ఈ కోవలోకే వస్తుంది. ఈ సంప్రదాయాన్ని చూడాలంటే సుర్గుజా జిల్లాకు వెళ్లాల్సిందే మరి. మాంఝా తెగకు చెందిన భైంసా గోత్ర ప్రజలు వివాహం సందర్భంగా ఇంటికి వచ్చే వరుడిని ఇలానే ఆహ్వానిస్తుంటారు.
మైన్‌పట్ నర్మదాపుర్ ప్రాంతంలో ఉండే ప్రజల సంప్రదాయమిది. వధువు సోదరులు గేదెల్లా మారిపోయి.. నడుము వెనుక ఓ తోకను తగిలించుకని బురదలోకి తిగుతారు.
గేదెల్లా ప్రవర్తిస్తూ.. బురదలో పడి దొర్లడం.. పోట్లాడటం, పరిగెత్తడం వంటివి చేస్తుంటారు. అనంతరం ఊరేగింపుగా వచ్చిన వరుడికి స్వాగతం పలికి ఇంటికి తీసుకెళ్తారు. తరతరాలుగా వస్తున్న ఈ వివాహ సంప్రదాయాన్ని వారు ఇప్పటికీ కొనసాగిస్తుండటం విశేషం.