జగిత్యాల జిల్లా అవిశ్వాస రాజకీయాలు చిలికి చిలికి గాలి వానలా మారుతున్నాయి. ఆ జిల్లా బీఆర్ఎస్ పార్టీని పట్టి కుదిపేస్తున్నాయి.ఈ వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ ఓ మహిళా చైర్ పర్సన్ బోగ శ్రావణి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై ఆరోపణల పర్వానికి దిగారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ..ప్రశ్నిస్తున్నామన్న కోపంతో ఎమ్మెల్యే అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు పిల్లలున్నారు.. వ్యాపారాలున్నాయని జాగ్రత్త అని బెదిరించడంతో పాటు డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. డబ్బులు ఇచ్చుకునే పరిస్థితుల్లో తాము లేమని చెప్పినా వినిపించుకోకుండా దొరతనపు అహంకారంతో బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక తనపై కక్ష గట్టారని బోగ శ్రావణి దుయ్యబట్టారు.
అభివృద్ధి పనులకు అడ్డొస్తూ.. తనకు చెప్పకుండా ఎలాంటి పనులు చేయవద్దని హుకూం జారీ చేశాడన్నారు. తాను నరక ప్రాయంగా మున్సిపల్ ఛైర్మన్ పదవిలో కొనసాగుతున్నానని, నడి రోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యానని ఆమె బాధను వెళ్లగక్కారు. మునిసిపాలిటీలో ఒక్క పని కూడా తనను ప్రారంభించేందుకు అవకాశం కల్పించడం లేదని,తనకు చెప్పకుండా ట్రాలీలు ఎందుకు కొన్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు.
ఆర్డీఓ కన్నా తక్కువ ప్రోటోకాల్ ఉండే మునిపిపల్ ఛైర్ పర్సన్ పదవిలో ఉండి జిల్లా స్థాయి అధికారులను ఎలా కలుస్తున్నావంటూ మండిపడ్డారన్నారు. తనకు అనుకూలంగా ఉన్న కొద్ది మంది కౌన్సిలర్లను కూడా టార్గెట్ చేసి టార్చర్ చూపించాడన్నారు. బీసీ మహిళననే కక్ష గట్టారని, సబ్బండ వర్గాలు రాజకీయాలకు పనికిరారా అని శ్రావణి ప్రశ్నించారు. తన కుటుంబాన్ని అణచి వేసి ఈ రోజు జగిత్యాల ఎమ్మెల్యే గెలిచారని, తప్పు ఎక్కడ జరిగింది చెప్తే సర్దుకుంటామని చెప్పినా కావాలనే తనను కార్నర్ చేశాడని ఆమె మండిపడ్డారు.